స్త్రీల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. ఆమె పోరాటాలు స్త్రీలందరికీ స్పూర్తి దాయకం. 1831వ సంవత్సరంలో జనవరి 3వ తేదీన మహారాష్ట్ర సతారా జిల్లా, నయాగావ్ అనే గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో సావిత్రీ బాయి ఫూలే జన్మించింది. తెలంగాణలో కూడా వీరికి బంధువులు ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మున్నూరుకాపులు వీరికి బంధువులు. 1840వ సంవత్సరంలో 9 ఏడ్లు ఉన్నప్పుడే సావిత్రి బాయి ఫూలేకు 12 ఏండ్లు ఉన్న జ్యోతీరావు ఫూలేతో వివాహం జరిగింది. అత్తవారింటికి వెళ్లిన తర్వాత తన విద్యాభ్యాసాన్ని సావిత్రి బాయి ఫూలే కొనసాగించారు.
వితంతువులకు శిరోముండనంపై ఉద్యమం
అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయురాలుగా శిక్షణ పొందిన సావిత్రి బాయి ఫూలే కుల వ్యవస్థ నిర్మూలను కృషి చేశారు. అనగారిన వర్గాల బాలికలకు విద్య నేర్పిస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. బాలికలకు చదువు చెప్తున్నారని ఆమెపై రాళ్ల దాడులకు కూడా పాల్పడ్డారు. అవన్నీటినీ ఎదుర్కొంటూ బాలికలకు ఆమె పాఠాలు భోధించి నేడు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా నిలిచారు. సావిత్రి బాయి ఫూలే, జ్యోతి బా ఫూలే కు సంతానం లేదు. కానీ వీరు ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుడిని దత్తత తీసుకున్నారు. 1848వ సంవత్సరం మే 12వ తేదీన మొట్ట మొదటి బహుజన పాఠశాలను సావిత్రిబాయి ఫూలే దంపతులు ప్రారంభించారు. ఆమె 18 ఏళ్లకే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించి స్త్రీల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. సావిత్రి బాయి ఫూలే మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి వారి హక్కుల కోసం పోరాడారు. భర్త చనిపోయిన వెంటనే వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శిరోముండనం చేయడంపై ఉద్యమాలు సైతం చేసి ఎంతో మంది స్త్రీలకు నేడు ఆదర్శంగా నిలిచారు. మూఢనమ్మకాలు, సతీసహగమనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేశారు. 2000 మంది అనాధ బాలలకు ఆశ్రయమిచ్చి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. 1854వ సంవత్సరంలో రచయిత్రిగా కూడా కావ్యఫూలే సంపుటిని ప్రచురించారు. 1891వ సంవత్సరంలో పావన కాశీ సుబోధ్ రత్నాకర్ ను ప్రచురించారు. ఆమె ఉపన్యాసాలు కూడా కొన్ని పుస్తక రూపం దాల్చాయి.
భారత చరిత్రలో భర్త చితికి నిప్పు పెట్టిన తొలి సంఘటన
1890వ సంవత్సరం, నవంబరు 28న అనారోగ్యం జ్యోతీరావు ఫూలే మరణించారు. అంత బాధలోనూ తన సంఘ సంస్కర్తగా తీసుకున్న నిర్ణయాలు అందరికి ఆదర్శంగా నిలిచాయి. జ్యోతీరావు పూలే చితికి నిప్పు పెట్టి భర్త చితికి నిప్పు పెట్టిన తొలి మహిళగా ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. ప్లేగు వ్యాధికి గురయిన ప్రజలకు సేవ చేశారు. వారికి ఆహారాన్ని సేకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే అదే ప్లేగు వ్యాధి సోకి సావిత్రి బాయి ఫూలే 1897వ సంవత్సరం, మార్చి 10వ తేదీన మరణించారు. భారత దేశంలో సావిత్రి బాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహిస్తారు.