Friday, June 9, 2023

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా?

Must Read

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా?

పంజాబ్.. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఈ ఇది మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. అలాగని ఇతర రాష్ట్రాలను తక్కువ చేయడమని కాదు. దేని ప్రత్యేకత దానిదే. అలాగే పంజాబ్ ప్రత్యేకత పంజాబ్దే. పంజాబ్ అంటే పంచ్ ఆబ్ (ఐదు నదుల సంగమం అని అర్థం). చీలం, జీనాబ్, రావి, బియాజ్, సట్లెజ్ నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తూ ఉంటాయి. నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో గోధుమలు లాంటి పంటల సాగులో పంజాబ్ను తలదన్నేదే లేదు.

వ్యవసాయంలో అగ్రగామిగా ఉండే పంజాబ్లో సైనికుల సంఖ్య కూడా అంతే ఉంది. ఆర్మీలో సిక్కు సోదరుల కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది. ఇంటికి ఇద్దరు బిడ్డలు ఉంటే.. ఒకరు తల్లిదండ్రులను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండాలి. మరొకరు దేశం కోసం మిలట్రీలో చేరాలి. ఇది పంజాబ్లో ఎన్నో ఏళ్లుగా వస్తున్న అనధికారిక రూల్ అంటుంటారు అక్కడి వాళ్లు. అందుకే సిక్కు సోదరులను దేశవ్యాప్తంగా అందరూ గౌరవిస్తారు.

అలాంటి పంజాబ్లో ఒక విషయంలో మాత్రం ఎప్పుడూ ఘర్షణలే. ఖలిస్థాన్ ఉద్యమంతో ఆ రాష్ట్రం ఎన్నో ఏళ్లుగా అట్టుడుకుతోంది. అసలు ఏంటీ ఖలిస్థాన్ అనేది తెలుసుకుందాం.. ఖలిస్థాన్ అనే పదం ఖల్సా నుంచి వచ్చింది. సిక్కు మతంలో దైవారాధనలో ఉండేవారు, గురువుకు పూర్తి శిష్యుడిగా మారడాన్ని ఖల్సా అంటారు. ఈ క్రమంలో కంగా, కేష్, కడా, కచ్చా, క్రిపాన్ అనే 5కే సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు. అలా నియమాలను పాటిస్తూ దైవారాధనలో ఉండే సిక్కులను ఖల్సాలు అంటారు. ఈ ఖల్సాల పేరు మీదే ఖలిస్థాన్ అనేది పుట్టింది. ఖలిస్థాన్ అంటే ఖల్సాలు ఉండే ప్రాంతం అని అర్థం.

భారత్-పాకిస్థాన్ విభజన సమయంలోనే ఖలిస్థాన్ మూలాలు ఏర్పడ్డాయి. మత ప్రాతిపదికన పాక్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. విభజనలో అప్పటి పంజాబ్ రాష్ట్ర రాజధాని లాహోర్ నగరం పాక్కు దక్కింది. దీంతో అక్కడ జరిగిన మత కల్లోలాల్లో లక్షలాది మంది శరణార్థులయ్యాయరు. వీరిలో సిక్కుల శాతం ఎక్కువని అంటుంటారు. ఇరు దేశాల విభజనలో సిక్కుల పవిత్ర మందిరంగా భావించే నాన్ఖానా సాహిబ్ పాక్ ప్రాంతం కిందకు వెళ్లిపోయింది. ఇది సిక్కుల ప్రథమ గురువు నానక్ దేవ్జీ పుట్టిన ప్రదేశం.

దేశం మొత్తం మీద చూసుకుంటే.. సిక్కుల జనాభా 2 శాతమే. ఇక, అంతా బాగుందని అనుకున్న తరుణంలో పంజాబ్ లో ఓ అలజడి మొదలైంది. పంజాబీ మాట్లాడే వారి కోసం పంజాబ్ను ప్రత్యేక దేశంగా, స్వయం ప్రతిపత్తిని కల్పించాలంటూ పంజాబ్ సుబా ఉద్యమం ప్రారంభమైంది. అయితే ఈ డిమాండ్ ను ఎస్సార్సీ కమిషన్ రిపోర్టు 1955లో తోసిపుచ్చింది. ఉమ్మడి పంజాబ్ రాష్ట్రాన్ని హిందీ మాట్లాడే హిమాచల్ ప్రదేశ్గా, హిందువులు ఎక్కువగా ఉండే హర్యానాగా, పంజాబీ మాట్లాడే/సిక్కులు ఎక్కువగా ఉండే ప్రాంతం పంజాబ్గా విభజించబడింది. దీంతో ఉమ్మడి పంజాబ్ కాస్త మూడు ముక్కలుగా విడిపోయింది.

పంజాబ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనా పంజాబీ సుబా ఉద్యమం మాత్రం ఆగలేదు. 1973 నాటికి ఈ ఉద్యమం మరింత ఉధృత స్థాయికి చేరుకుంది. ఖలిస్థాన్ ఉద్యమంపై 1971లో ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్లోనూ ఒక ప్రకటన కూడా రావడం గమనార్హం. ఇక, 80ల్లో ఈ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న జర్నల్ సింగ్ బింద్రేవాలే కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. బింద్రేవాలే అనుచరులు హింసకు పాల్పడటం బాగా ఎక్కువైంది.

1982లో జర్నల్ సింగ్ బింద్రేవాలే చేసిన ఓ చర్య.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పంజాబ్లో అధికారంలో ఉన్న అకాలీదళ్ ప్రభుత్వం అండతో ‘ధరమ్ యుద్ధ్ మోర్చా’ అనే ఉద్యమాన్ని బింద్రేవాలే ప్రారంభించారు. అమృత్సర్లోని పవిత్రమైన స్వర్ణదేవాలయంలో తన అనుచరులతో కలసి పోలీసులకు వ్యతిరేకంగా ఆయుధాలతో ప్రదర్శనలు చేశారు. దీంతో ఇందిరా గాంధీ బింద్రేవాలేను, ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణచివేయాలని నిర్ణయించుకున్నారు.

ఆపరేషన్ బ్లూస్టార్ కు ఇందిర గ్రీన్ సిగ్నల్
1984లో ఆపరేషన్ బ్లూస్టార్ను మొదలుపెట్టారు ఇందిరా గాంధీ. ఇందులో భాగంగా గోల్డెన్ టెంపుల్కు చేరుకున్న ఇండియన్ ఆర్మీ.. బింద్రేవాలేతో సహా అతడి అనుచరులును, ఖలిస్థాన్ మద్దతుదారులను ఏరిపారేసింది. ఈ ఆపరేషన్ విజయవంతం అయినప్పటికీ, కేంద్రంపై పంజాబ్ లోని ఖలిస్థాన్ మద్దతుదారుల్లో ఆగ్రహావేశాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఇందిరను చంపేందుకు ఖలిస్థాన్ మద్దతుదారులు కుట్రపన్నారు. ఆ ప్రయత్నంలో అక్టోబర్ 31, 1984న ఆమెను హత్య చేశారు.

ఇందిర మరణంతో దేశవ్యాప్తంగా మతకల్లోలం చోటుచేసుకుంది. ఎక్కడ సిక్కులు కనిపించినా చంపేయాలనేంతగా భీకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్లో ఈ అస్థిరతకు, ఖలిస్థాన్ ఉద్యమానికి అండగా పాక్ ఉందని ఇప్పటికీ ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. భారత్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే దాయాది ఇంతకు తెగించిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.

విదేశాల నుంచి ఆర్థిక సాయం
ఆపరేషన్ బ్లూస్టార్తో ఖలిస్థాన్ ఉద్యమానికి తాత్కాలికంగా బ్రేకులు పడినా, దాని ప్రభావం మాత్రం మద్దతుదారుల్లో కొనసాగుతూ వచ్చింది. చాలా మంది ఖలిస్థాన్ మద్దతుదారులు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి ఫారిన్ కంట్రీల్లో ఉంటూ భారత్లో అలజడులకు సాయం అందిస్తున్నారు. ఈ ఉద్యమానికి ఫండింగ్ ఆయా దేశాల నుంచే ఎక్కువగా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్లో ఖలిస్థాన్ ఉద్యమం మళ్లీ మొదలైంది.

అమృత్ పాల్ అరెస్టుతో ఫుల్ స్టాప్ పడేనా?
ఖలిస్థాన్ ఉద్యమాన్ని ఇప్పుడు పంజాబ్లో నడిపిస్తోంది అమృత్పాల్ సింగ్ అనే వ్యక్తి. ‘వారిస్ దే పంజాబ్’ అనే సంస్థ ద్వారా పంజాబ్ లో ఖలిస్థాన్ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాడు అమృత్పాల్. తాజాగా అతడ్ని అరెస్ట్ చేశారు. సినిమా రేంజ్ లో దాదాపు 50 మంది పోలీసులు అతడ్ని ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. అతడి అరెస్టు నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా 24 గంటల పాటు ఇంటర్నెట్, మెసేజ్ సేవలను నిలిపివేశారు. పంజాబ్ ఇంకెంత కాలం ఇలా అట్టుడికిపోతుందో తెలియడం లేదు. దీనికి పరిష్కారం లభిస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

- Advertisement -
Latest News

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -